తెలుగు · Baddena
సుమతీ శతకము
Sumati Satakam
శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ
అడిగిన జీతంబియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ
అడియాస కొలువు గొలువకు, గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ
అధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ
అప్పు కొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ
అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
అల్లుని మంచితనంబును, కాపు సాహిత్య విద్య, కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ
ఆకొన్న కూడె యమృతము, తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ
ఆకలి యుడుగని కడుపును, వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్, బ్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత మేదిని సుమతీ
ఇచ్చునదె విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ
ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ
ఉడుముండదె నూరేండ్లును, బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్, మడువున గొక్కెర యుండదె, కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ
ఉత్తమగుణములు నీచున కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ?
ఉదకము ద్రావెడు హయమును, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడ నున్న వృషభము, జదువని యానీచు గడకు జనకుర సుమతీ
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ
ఉపమింప మొదలు తియ్యన కపటం బెడనెడను జెఱకు కై వడినే పో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ
ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్ తెప్పలుగ జెఱువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ
ఏఱకుమీ కసుగాయలు, దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ, పాఱకుమీ రణమందున, మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ
ఒక యూరికి నొక కరణము, నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్, గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ
ఒరు నాత్మ దలచు సతి విడు, మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ, వెఱ పెఱుగని భటునేలకు, తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ
ఒల్లని సతి నొల్లని పతి, నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే గొల్లండు, కాక ధరలో గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ
ఓడల బండ్లును వచ్చును, ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్, ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్ దడవుండ నిచ్చెనేనియు బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ
కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ
కప్పకు నొరగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్, ముప్పున దరిద్రుడైనను, తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ
కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ
కరణము గరణము నమ్మిన మరణాంతక మౌను గాని మనలేడు సుమీ; కరణము దన సరి కరణము మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ
కరణముల ననుసరింపక విరసంబున దిన్న తిండి వికటించు జుమీ యిరుసున కందెన బెట్టక పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ
కరణము సాదైయున్నను, గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్, ధర దేలు మీటకున్నను, గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ
కసుగాయ గఱచి చూచిన మసలక పస యొగరు రాక మధురంబగునా; పస గలుగు యువతులుండగ పసి బాలల బొందువాడు పశువుర సుమతీ
కవి కాని వాని వ్రాతయు, నవరస భావములు లేని నాతుల వలపున్, దవిలి చను పంది నేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ
కాదు సుమీ దుస్సంగతి, పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్, వాదు సుమీ యప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ
కాముకుడు దనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్ బ్రేమమున జెఱకు పిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ
కారణము లేని నగవును, బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో బూరణము లేని బూరెయు, వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ
కులకాంత తోడ నెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ
కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ
కొంచెపు నరు సంగతిచే నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ
ఈ పాఠం, మూలాల గురించి
అనుసంధానించిన మూలాన్ని అనుసరించిన పాఠం. లేఖన దోషాలు లేదా ప్రాంతీయ భేదాలు ఉండవచ్చు. అర్థానువాదం చేర్చలేదు. ఈ పాఠాన్ని పూర్తిగా స్వతంత్రంగా సరిచూడలేదు.
Baddena; te.wikisource.org contributors. Revision history is linked from the source.
సవరణ 563225 · సేకరించిన తేదీ 2026-10-18
Baddena, 13th century; source carries a PD-old notice identifying pre-1931 publication and an author deceased more than 100 years ago. Only original verse in pre elements is imported; explanatory prose is excluded.
Original-language verse text only, selected with pre; HTML, navigation, editorial line numbers and commentary outside the selector omitted; whitespace normalized. No translation added.
CC-BY-SA-4.0Baddena; te.wikisource.org contributors. Revision history is linked from the source.
సవరణ 437133 · సేకరించిన తేదీ 2026-10-18
Baddena, 13th century; source carries a PD-old notice identifying pre-1931 publication and an author deceased more than 100 years ago. Only original verse in pre elements is imported; explanatory prose is excluded.
Original-language verse text only, selected with pre; HTML, navigation, editorial line numbers and commentary outside the selector omitted; whitespace normalized. No translation added.
CC-BY-SA-4.0